కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టే విధానాలను వ్యతిరేకిద్దాం: అఖిల భారత కిసాన్ మహాసభ పిలుపు
రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజునూలో జరిగిన అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమస్యలను డి. హరినాథ్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సారవంతమైన పంట భూములను బహుళజాతి సంస్థలకు అతి తక్కువ ధరలకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి తడ వరకు కార్గో ఎయిర్‌పోర్టులు, విమానాశ్రయాలు, థర్మల్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల కోసం బలవంతపు భూసేకరణ జరుగుతోందన్నారు.
ఉత్తరాంధ్రకు కల్పవృక్షంగా ఉన్న ను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారని విమర్శించారు. ప్లాంట్ నిర్వహణలో లోపాలు, పాత యంత్రాల వినియోగం కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని, మరోవైపు ArcelorMittalకు వేలాది ఎకరాల భూములతో పాటు గనులను కేటాయించారని ఆరోపించారు.
జీడి పంటకు ప్రసిద్ధి చెందిన పలాస ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టు కోసం 2,400 ఎకరాలు, మరో ఎయిర్‌పోర్టు కోసం 1,185 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. విజయనగరంలో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాలు సేకరిస్తూ హరితాంధ్రను పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని, కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో గతంలో సెజ్‌ల కోసం సేకరించిన 11 లక్షల ఎకరాలకు పైగా భూములు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో పరిశ్రమలు ఏర్పాటు చేయని భూములను తిరిగి రైతులకు ఇవ్వాలనే భూసేకరణ చట్ట నిబంధనలను అమలు చేయకుండా ఇతర సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో మామిడి, జీడి, కొబ్బరి, అరటి పండే సారవంతమైన భూముల్లో సోలార్ పరిశ్రమ కోసం నాలుగు వేల ఎకరాలు సేకరించేందుకు ప్రజాభిప్రాయం తీసుకోకుండానే నోటిఫికేషన్ జారీ చేశారని, రైతుల తిరుగుబాటుతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందన్నారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారని చెప్పారు.
రాష్ట్రంలో పత్తి, మిర్చి, పొగాకు, మామిడి, మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బర్లీ పొగాకు రైతులు గత సంవత్సరం తీవ్ర నష్టాలు చవిచూశారని, వేలాది మంది రైతులు పొగాకు బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారని గుర్తుచేశారు. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.2,400 ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు రూ.1,600కే కొనుగోలు చేశారని ఆరోపించారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని, తడిసిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టిందన్నారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఉల్లి, సెనగ రైతులు కూడా గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులకు బడ్జెట్‌లో అతి స్వల్ప కేటాయింపులు మాత్రమే చేస్తున్నదని విమర్శించారు. పల్నాడు జిల్లాలో వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపనలు మినహా నిధుల కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రైతులతో కలిసి పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా కౌలుదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వాసితుల సమస్యలపై ఆందోళనలు చేపట్టామని, నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతుల కోసం ధర్నా నిర్వహించామని చెప్పారు.
రాష్ట్రంలో యూరియా కొరత కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అఖిల భారత కిసాన్ మహాసభ రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తోందని, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులను విజయవంతం చేస్తున్నట్లు డి. హరినాథ్ తెలిపారు.
కార్పొరేట్ సంస్థలకు భూముల కట్టబెట్టే విధానాలను రైతాంగం ఐక్యంగా వ్యతిరేకించాలని అఖిల భారత కిసాన్ మహాసభ పిలుపునిచ్చింది.