పీటీ కొత్తూరులో ఘనంగా జాతీయ పోషణ మహోత్సవాలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం పీటీ కొత్తూరు అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ కృష్ణకుమారి మాట్లాడుతూ చిన్నపిల్లలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సీజన్‌లో లభించే ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలను గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో మొక్కలు నాటారు. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పోషకాహార ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు బి. శివకుమారి, షేక్ బాజీ, కే. చైతన్య భవాని, పట్టణ అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.