ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం – 2026 సముద్రం: జీవనాధారం సముద్రం … జీవానికీ, జీవనానికీ ఆధారం.
సముద్రం అంచున కూర్చుని దాన్ని చూస్తుంటే, కళ్లతో కొలవలేనంత దూరం, మనసుతో కొలవలేనంత అనంతం, ప్రశాంతం అనిపిస్తుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచుకున్న బడబానలెంత, ఆ అగాధ జలనిధిలో ఆణిముత్యాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. కానీ సముద్రం మనకూ, భూమి మీద అన్ని జీవరాసులకూ ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి.
భూమి: నీటిపెద్ద గ్రహం
భూమి ఉపరితలాన్ని 70 శాతం మేర సముద్రాలు ఆవరించాయి. భూఉపరితలంలోని మొత్తం నీటిలో 97 శాతం సముద్రాలలోనే ఉంది. అయిదు మహాసముద్రాలుగా విభజించుకున్నా, సముద్రం అపార, అవిచ్చిన్న జలరాశి. అంతరిక్షం నుంచి కూడా భూమి నీలంగా కనిపించే కారణం ఇదే.
సముద్రం ఏర్పడిన తీరు
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం ప్రారంభించింది. తేలికైన రాళ్లు పైకి లేచి క్రస్ట్ (పటలం) గా, బరువైన రాళ్లు లోపలికి కుంగి కోర్, మాంటిల్ ఏర్పడ్డాయి. భూలోపల రాళ్ల నుంచి జల ఆవిరి విడుదలై, చివరికి మహాసముద్రాలుగా విస్తరించింది.
మనం బతకగలమా?
ప్రాణవాయువు ఫ్యాక్టరీ
మనకు శ్వాస తీసుకోవడానికి సముద్రం ముఖ్యం. ఆక్సిజన్‌లో 50–70% సముద్రపు ఫైటోప్లాంక్టన్ నుండి వస్తుంది. దీనివల్లనే సముద్రాన్ని భూమి ఊపిరితిత్తులు అనుకోవచ్చు.
ప్రకృతి ఎయిర్ కండిషనర్
సముద్రం వేడిని గ్రహించి, చల్లదనం నిల్వచేసి, వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది. సముద్రం లేకుంటే భూమి ఒకవైపు మండిపోతూ, మరోవైపు ఘనీభవించిపోతుంది.
నీటి చక్రంలో పాత్ర
సూర్యుడి వేడికి నీరు ఆవిరై, గాలిలో తేమను పెంచుతుంది. మేఘాలుగా మారి, వర్షంగా లేదా ఇతర రకాల వర్షపాతంగా విడుదల అవుతుంది. భారతదేశం లో వచ్చే వర్షాలు సముద్రాల వల్లే.
కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించడం
సముద్రం పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలైన 30% CO₂ను గ్రహిస్తుంది. అయితే, ఎక్కువ గ్రహించడం వల్ల సముద్రపు నీరు ఆమ్లంగా మారుతూ, పగడాలు, చిప్పలకు ప్రమాదం కలిగిస్తుంది.
ఆహారం మరియు ఉపాధి
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది సముద్రంపై ఆధారపడుతారు. భారతదేశం తీర ప్రాంతాల్లో వేలాది గ్రామాలు సముద్ర జీవన పద్ధతిని కొనసాగిస్తున్నాయి.
రవాణా మార్గం
ప్రపంచంలో 80% వాణిజ్యం సముద్రపథాల ద్వారా జరుగుతుంది. చమురు, ఎలక్ట్రానిక్స్, బట్టలు, మందులు సముద్రంపై ఆధారపడి ఉంటాయి.
జీవ వైవిధ్యం నిలయం
సముద్రం లక్షలాది జీవజాతులకు నివాసం. తిమింగళాలు, ఆక్టోపస్, జెల్లీఫిష్, పగడపు దిబ్బలు – ఇంకా అన్వేషించని రహస్య జీవులు సముద్రగర్భంలో దాగి ఉన్నాయి.
సప్త సముద్రాలు మరియు మహాసముద్రాలు
ప్రపంచంలో సుమారు 50 సముద్రాలు ఉన్నాయి. సాధారణంగా సముద్రం అంటే మహాసముద్రంలోని ఒక భాగం మాత్రమే.
సుస్థిర మత్స్య పద్ధతులు
సుస్థిర మత్స్య పద్ధతులు భవిష్యత్తు తరాలకు చేపల జనాభాను కాపాడతాయి. ఫిలిప్పీన్స్, తగ్బనువా ప్రజలు సీజన్లను, చంద్రునిపై ఆధారపడి చేపలు పట్టే పద్ధతులు పాటిస్తారు.
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం – 2026
జూన్ 8వ తేదీ, ఈ సంవత్సరం థీమ్: “సస్టైనబుల్ ఫిషింగ్ అంటే మరింత ఎక్కువ”.
అత్యధిక చేపలు పట్టడం వల్ల కలిగే నష్టాలను తగ్గించి, భవిష్యత్ తరాలకు సురక్షిత సముద్ర జీవవైవిధ్యాన్ని అందించడం లక్ష్యం.
భారతదేశంలో పరిస్థితి
భారత దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారు. కానీ అధిక వేట, చట్టవిరుద్ధ వేట, కాలుష్యం వల్ల సముద్ర వనరులు ప్రమాదంలో ఉన్నాయి.
ప్రయత్నాలు
‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) ద్వారా సస్టైనబుల్ ఫిషింగ్, సముద్ర నీటి సాగు, చిన్న తెప్పల యాంత్రీకరణ ప్రోత్సహింపబడుతోంది.
స్థానిక సంఘాల మద్దతు
మహిళా స్వయం సహాయక సంఘాలు చేపల ప్రాసెసింగ్, మార్కెటింగ్ లో నిమగ్నమై ఆర్థిక స్వావలంబన సాధిస్తాయి. ‘సముద్ర సంరక్షణ కమిటీలు’ పర్యావరణవేత్తలతో కలిసి చట్టవిరుద్ధ సాధనాలను గుర్తించి నివేదిస్తాయి.
సముద్ర సంరక్షణ చర్యలు
సముద్ర సంరక్షిత ప్రాంతాలను (MPAs) పెంచడం
ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం
చైతన్యం ద్వారా స్థానికుల అవగాహన పెంచడం
నిఘా వ్యవస్థలను కఠినతరం చేయడం
మన బాధ్యతలు
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి
చేపలు పట్టడంలో బాధ్యతగా ఉండాలి
బీచ్‌లను పరిశుభ్రంగా ఉంచాలి
సర్టిఫైడ్ నెట్లను ఉపయోగించి సస్టైనబుల్ ఫిషింగ్ చేయాలి
ప్రాణాధారమైన సముద్రం
సముద్రం ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తు తరాలకు అపరిమిత వనరులను అందిస్తుంది. మనం దానిని గౌరవించాలి, అతిగా వేటను నిరోధించాలి.
ప్రధాన హెచ్చరిక – ప్రమాదపు లోతుల్లో చేపలు
బ్లూఫిన్ ట్యూనా వంటివి వేగంగా, భారీగా పెరుగుతాయి. కానీ అధిక డిమాండ్ వల్ల జనాభా ప్రమాదంలో ఉంది. ప్రతి సంవత్సరం 770 కోట్ల కిలోగ్రాములకు పైగా సముద్ర ప్రాణులను వేటాడుతారు. అతి చేపల వేట(overfishing) మత్స్య పరిశ్రమ కూలే ప్రమాదం కలిగిస్తుంది.
సస్టైనబుల్ ఫిషింగ్ – రక్షణకు మార్గం
అధిక వేట నివారించడం
నిషేధిత సాధనాలు వాడకపోవడం
నిర్దిష్ట కాలాల్లో మాత్రమే చేపలు పట్టడం
ప్రయోజనాలు
సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ
ఆర్థిక భద్రత
ఆహార భద్రత
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం